Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

విండోస్ 7 ఎలా ఉంటుంది..?






మనలో చాలా మంది ఇప్పటికీ 2001లో మైక్రోసాఫ్ట్ కంపెనీ వృద్ధి చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఎక్స్‌పీనే విరివిగా ఉపయోగిస్తున్నాం. సులభంగా, వేగంగా పనిని చేసుకోవడంతో పాటు మరికొన్ని తేలికగా ఉపయోగించగల వైవిధ్యమైన ఫీచర్లుండటం ఎక్స్‌పీలో ఉన్న సౌలభ్యం. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ కంపెనీ 2007లో ఎక్స్‌పీ కొత్త వెర్షన్‌గా విండోస్ విస్తాను మరిన్ని ఫీచర్లతో విడుదల చేసింది.

అనేక ఫీచర్లతో విడుదలైన విస్తా.. కంప్యూటర్‌ను గొప్ప సామర్థ్యం గల దానిగా పనిచేయిస్తుంది. గత ఆపరేటింగ్ సిస్టమ్‌లలో లాగా సిస్టమ్ హ్యాంగ్ కావడం లేదా క్రాష్ కావడం వంటి సమస్యలను ఇది అధిగమించేలా తీర్చిదిద్దారు.

అయితే విస్తృతమైన ఫీచర్లు ఉండటంతో అప్లికేషన్‌లపై పని చేసే సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సమస్యను అధిగమించడానికి తప్పనిసరి పరిస్థితుల్లో దానికి సపోర్ట్ చేసే హార్డ్‌వేర్‌ను అదనంగా తీసుకోవలసి వచ్చేది.

దీంతో ఈ హార్డ్‌వేర్ కోసం అయ్యే ఖర్చు గిట్టుబాటు కాదనే ఉద్ధేశ్యంతో భారత వినియోగదారులు దీనిపై పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఇంకా చెప్పాలంటే విండోస్ విస్తా నిరాశపరిచిందనే చెప్పాలి. అలా భారీ అంచనాలతో విడుదలైన విస్తా.. పెద్దగా ఆదరణ పొందలేకపోయిందని మార్కెట్ వర్గాలు అంటాయి.

విస్తా విఫలం కావడంతో మైక్రోసాఫ్ట్ వెంటనే మరొక వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను త్వరితంగా విడుదల చేయాలని సన్నాహాలు మొదలెట్టింది.
అలా అందరి ముందుకు త్వరలో రాబోతున్నదే 'విండోస్ 7'. అందరి అంచనాలను విస్తా తలక్రిందులు చేసినప్పటికీ.. త్వరలో రానున్న విండోస్ 7పై భారీ అంచనాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ విండోస్ 7 అక్టోబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బీటా వెర్షన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. దీనినే రిలీజ్ కాండిడేట్ (ఆర్‌సి) అంటారు. ఆ తర్వాత దీనికి తుదిరూపాన్నిచ్చి మార్కెట్లోకి విడుదల చేస్తారు.






విండోస్ 7 ఎలా ఉండొచ్చు?
మార్కెట్ వర్గాల వివరాల ప్రకారం సరికొత్త విండోస్ 7 ఈ క్రింది ఫీచర్లను కలిగి ఉంటుంది.

విస్తాలోని రిసోర్స్ హంగ్రీనెస్ సమస్యను అధిగమిస్తూ.. వేగవంతంగా ఈ విండోస్ 7 పనిచేస్తుంది. బూటింగ్ చాలా త్వరితంగా ఉంటుంది మరియు హైబర్‌నేషన్ మోడ్‌లోను వెలుపలకి రావచ్చు. అంటే.. కేవలం 10 సెకన్లలోపే ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవుతుందన్నమాట. అలాగని దీని కోసం అదనంగా రామ్‌ను జోడించక్కర్లేదు.

విండోస్‌ 7 కేవలం 7.5 జీబీ డిస్క్ స్పేస్‌ కన్నా తక్కువ మాత్రమే తీసుకుంటుంది. అదనపు అపగ్రేడింగ్‌లు కూడా అవసరం లేదు. ఏకకాలంలో అనేక అప్లికేషన్‌లు మరియు ఫైళ్లపై పనిచేసే వారికి ఇందులో ప్రత్యేక సౌలభ్యాన్ని కల్పించారు. 'జంప్ మెనూ' అంటూ ఒక ప్రత్యేక ఆప్షన్‌ అదనంగా ఇవ్వడం జరిగింది.

అలాగే అనేక విండోలను ఓపెన్ చేసి.. అందులో ఒక దానిపైనే ఎక్కువగా పని చేయాల్సి వచ్చినప్పుడు.. మిగిలిన విండోల వల్ల ఏర్పడే ఇబ్బందిని నిరోధించవచ్చు. మౌస్‌తో విండోస్ టైటిల్ బార్ వద్ద వేగంగా కదిలిస్తే చాలు ఓపెన్ చేసిన ఉన్న విండోలన్నీ కనిపించవు.

మళ్లీ ఆ విండోలు కావాలనకుంటే.. అదే తరహాలో మౌస్‌ను కదిలిస్తే అన్నీ మీ కళ్లముందు ఉంటాయి. ఏకకాలంలో రెండు డాక్యుమెంట్లను పోల్చి చూడాలనుకున్నప్పుడు ఎక్స్‌పీలో లాగా ఒకదాని పక్కన ఒకటి అమర్చుకోనవసరం (మాన్యువల్‌గా) లేదు.

విండోస్ 7లో సరికొత్తగా రిమోట్ మీడియా స్ట్రీమింగ్ అనే ఆప్షన్‌ను కూడా ఇవ్వడం జరిగింది. దీని వల్ల టీవీ ఛానెల్ మార్చేందుకు రిమోట్ ఎలా ఉపయోగపడుతుందో.. మీ కంప్యూటర్‌లోని విండో లేదా ఫైళ్‌ను ఓపెన్ చేసేందుకు రిమోట్ ద్వారానే చేసుకునే సౌకర్యం ఉంటుంది.


ఇందులో ఉన్న మరో సౌలభ్యం.. విండోస్ 7 స్పర్శా సామర్థ్యం కలిగి ఉంటుంది. కంప్యూటర్ స్క్రీన్‌పై మీ చేతి వేళ్లను ఉపయోగించి అనేక కార్యక్రమాలను నిర్వహించవచ్చు. అయితే మీ దగ్గరున్న పీసీ (పర్సనల్ కంప్యూటర్‌కు) స్పర్శా సామర్థ్యానికి సరిపోయేదిగా ఉండాలి.

ఇంకా గ్రాఫిక్ యూజర్ ఇంటర్‌ఫేస్‌లో మార్పులు.. డేటా సెక్యూరిటీ, మొబైల్‌తో కనెక్టివిటీ, సింక్రనైజేషన్, పవర్ మేనేజ్మెంట్, వంటి తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ విండోస్ 7తో కూడిన నోట్‌బుక్‌లు కూడా మార్కెట్లోకి రానున్నాయి. అయితే ఇందులో విండోస్ 7 కోసం కేవలం 2 జీబీ రామ్‌ను మాత్రమే తీసుకునేలా రూపొందించనున్నట్లు తెలిసింది.

వింటుంటేనే ఇలా ఉంటే.. మరి విండోస్ 7పై పనిచేస్తే ఎలా ఉంటుందోనని విద్యార్థులు, మార్కెట్ నిపుణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వారి అంచనాలను విండోస్ 7 అందుకుంటుందా..?
అంటే.. విండోస్ 7 విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే మరి.


స్పందనలు

Re: విండోస్ 7 ఎలా ఉంటుంది..?
బావుంది రమేష్.. ఇలాంటి మంచి ఆసక్తికరమైన విషయాలను ఎన్నో మాకు తెలియజేస్తావని ఆశిస్తూ... హర్ష
Re: విండోస్ 7 ఎలా ఉంటుంది..?
your are given plenty of information. keep it up.
Re: విండోస్ 7 ఎలా ఉంటుంది..?
కృతజ్ఞతలు.. తప్పనిసరిగా వీలున్నంతవరకు అందించగలను.
నిరాకరణ