వెయ్యి సార్లు జపం (మెడిటేషన్) కన్నా ఓ సారి సంగీతాలాపన మిన్న. ఇది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎక్కడో చదివి అలాగే మనసు మూలల్లో నాటుకుపోయిన వాక్యం. బహుశా ఈ కారణం చేతనో లేక... మా నాన్నగారి గాత్రం నాకు వచ్చిందో తెలియదు కానీ... పుట్టకతోనే సంగీతం నేర్చుకోకుండానే... నేను ఏ పాటనైనా సరే శృతికి అనుగుణంగా లయబద్ధంగా పాడేవాడిని. ఇది ఆ దేవుడు నా కిచ్చిన మరో అదనపు అరుదైన వరమని నేను గర్వంగా చెప్పుకోగలను.
అప్పట్లో తెలియదు కానీ... నాలో ఆసక్తి ఎలా ఉండేదంటే... అంతకుముందు ఎన్నో సార్లు విన్నా గానీ.. సాహిత్యం గురించి అప్పుడప్పుడే అర్ధం చేసుకుంటున్న తరుణంలో తొలిసారి స్వాతి ముత్యం చిత్రంలో లాలి... లాలి.. లాలి.. లాలి అనే పాటను విని కళ్ల వెమ్మట నీళ్లు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఆ పాట వింటే తొలి సారి విన్న ఫీలింగ్. గాల్లో అలా తేలిపోతాను. అంత ఆనందమేస్తుంది. ఆ స్వరం అయినా సరే.. సాహిత్యమైనా సరే.
అయితే సంగీతంలో ఏదేదో చేసేయాలనుకున్న నేను... ఆ దిశగా ఓ మోస్తరు ప్రయత్నాలు చేశాను. నా గాత్రానికి మెరుగులు దిద్దాలనుకున్నా. కానీ అప్పుడు మాస్టారు అందుబాటులో లేరు. సరేనని తొలుత నాకిష్టమైన వయోలిన్ నేర్చుకోవాలనుకున్నా... కానీ అది కుదరలేదు.
కానీ గిటార్ నేర్పుకోమని గిటారిస్ట్ అయిన నా ఫ్రెండ్ శివ చెప్పాడు. సరేనని అతని దగ్గరే శిష్యరికం చేశా. నా గొంతు అతనికి బాగా నచ్చిందట. అప్పటికీ... ఇప్పటికీ కూడా నా చేత అదే పనిగా పాటలు పాడించుకుంటూ అబ్బో తెగ ఆనందపడిపోతుంటాడు లెండి. నిజానికి గురువు నా ఫ్యాన్ అవ్వాలి. ఇక్కడేమంటే రివర్స్ నా గొంతుకు శివ దాసుడైతే... గురువు కాని గురువు.. శివకు నేను సేవకుడినయ్యాను.
ఎందుకు సేవకుడిని అన్నానంటే... ఎంతో మంది వ్యక్తులు అన్నీ ఉన్నా నిరాశ, నిస్పృహలతో నీరసపడిపోవడం... జీవితాన్ని పఠించలేక... లేక మనుగడ సాగించలేక పూర్తిగా వెనుకబడిపోయి... మానసిక బలహీనతతో... మనో వైకల్యాన్ని కలిగి ఉండటం మనం చూస్తున్నదే. మేము ఐదుగురం ఉన్నాం. తను మాత్రం చిన్నతనంలో వచ్చిన పోలియోను కూడా లెక్కచేయక మా అందరిలోను ఎంతో స్ఫూర్తిని నింపి ముందుకు నడిపించే శక్తిలా... నిలిచాడు.
ఇక అలాంటి వ్యక్తి సహచర్యం నాకు ఎన్నో విషయాలను నేర్పింది. ఇంకా ముందుకెళితే సరికొత్త లోకాన్ని చూపించిందని చెప్పొచ్చు. అలా ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకున్నా... వారి సపోర్ట్ నాకు దొరక్కపోయినా శివ స్ఫూర్తితో గిటార్‌ను ఎంతో శ్రద్ధగా నేర్చుకున్నాను. అదే సమయంలో ఓ సంగీతం మాస్టారు.. (ఆయన పేరు పాలకూరి రంగనాధం గారు) మంచి మాస్టారు లెండి. కాస్తంత ఔషధం (మందు) పోస్తే చాలు.. ఆటోమేటిక్‌గా ముందు రాబోయే పాఠాలను కూడా చెప్పేసేవారు. అలా నేను పంచరత్నాల వరకు నేర్చుకున్నాను.
అటు సంగీతం... ఇటు గిటార్.. రెండు నేను ఒకే సమయంలో అభ్యసించాను. ఓ వైపు పాశ్చాత్య.. మరో వైపు దేశీయ సంప్రదాయ సంగీత కళ. ఈ రెండింటి మేళవింపులతో నరనరాన సంగీతం ప్రవహించిందంటే.. సంగీతంలో నేను ఎంత కృతకృత్యుడనయ్యానో అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో అందరూ నన్నో పిచ్చోడిలా చూసేవారు.
కరెక్టేగా మరి.. సైకిల్ మీద వెళ్లేప్పుడు... లేదు నడిచి వెళ్లేప్పుడు సరిగమల ఆరోహణ.. అవరోహణలను అలా అలా నెమరేసుకుంటూ వెళుతుంటా. స్టేజి మీద కాక దార్లో పోతూ ఇలాంటి పనులు చేస్తే అది చూసే వాళ్లు పిచ్చోడనక... ఇంకేమంటార్రా నాయనా అంటూ నా ఫ్రెండ్ ఎగతాలి. అయితే అఫ్‌కోర్స్ నేనవి పట్టించుకోలేదు లెండి. అలా నేను సంగీత సాగరంలో విహరిస్తున్న సమయంలో గిటారిస్ట్ అయిన నా ఫ్రెండ్ తన గురువు (శ్యామ్ సుందర్) ను పరిచయం చేశారు.
ఆయనతో అనుకోకుండా పెరిగిన సాన్నిహత్యంతో గిటార్‌లో చక్కగా ప్లే చేయగల సామర్థ్యం వచ్చింది. నిజానికి అది నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందిట. చెప్పుకోకూడదు కానీ మనం దాన్ని ఓ ఆరునెలలలోపే పూర్తి చేసేశాం. అంటే అభ్యసించాల్సిన పాఠాలన్నమాట. ఇంకా చెప్పాలంటే... నాకు నచ్చిన ఏ పాటనైనా పాడుతూ ప్లే చేయగలను అన్న స్థాయికి... ఇతరులు అడిగిన దానిని కూడా దాదాపు ప్లే చేస్తాననే స్థాయికన్నమాట.
గిటార్ క్లాసులకు క్రమం తప్పకుండా హాజరవుతున్న రోజుల్లో ఎలా గడిచిందో అసలు లెక్కే లేదు. ఓ వైపు ఇంట్లో సరిగా ఆదరించకున్నా... లేక చీదరించుకున్నా... గిటార్ క్లాసుకు వెళ్లే ఓ గంట సంతోషంతో మిగిలిన వాటిని పూర్తిగా మరిచిపోయేవాడిని. బాగా ఫ్రెష్ అయ్యే వాడిని. కానీ నాకా విషయం తెలిసేది కాదు. ఆ గంటలో నేను ఒత్తిడి నుంచి బయటపడుతున్నానని కూడా అర్ధమయ్యేది కాదు. అయితే ఈ క్రెడిటంతా శివ... గురువుగారు (శ్యామ్ సార్)కి దక్కుతుంది. వాళ్లు నన్నలా ఆదరించారు. ప్రేమ చూపించారు.
అప్పటివరకు సంగీతంలో గడిపిన నేను... సమస్యల సుడి గుండంలో చిక్కుకున్నాను. అంతకుముందే ఉన్నా... వాటి ఘాటు ఎక్కువైంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. ఉద్యోగాన్వేషణలో ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ కంపెనీ హచ్‌లో ప్రీపెయిడ్ ఎగ్జ్‌క్యూటివ్‌గా జాయిన్ అయ్యాను. మా ప్రాంతానికి తొలి ప్రీపెయిడ్ ఎగ్జ్‌క్యూటివ్ నేనే.
కొంత తేరుకున్నాక.. ఆ సమయంలో గిటార్ గురువుగారు (శ్యామ్) జెమినీ టీవీ కార్యక్రమంలో ఓ సారి ప్రయత్నించు రమేష్ నీ గొంతు బాగుంటుంది. దానికి తోడు నీ వాయిస్‌కి గిటార్ యాడ్ అయితే చాలా బాగుంటుంది అన్నారు. దీంతో సరేనన్నాను. సార్ దగ్గరే ప్రాక్టీసు. ఇంకేముంది మళ్లీ పాత రోజులు వచ్చాయి.. పదిరోజుల ప్రాక్టీసులో గురువుగారి సన్నిధిలో అలా అలా సంతోషంగా... ఆనందపు కేరింతలతో క్షణాల్లో గడిచిపోయాయి.
జెమినీ టీవీ కార్యక్రమానికి ముందుగా సెలెక్షన్స్‌లో పాల్గొనాలి. తిరుపతి హోటల్ బ్లిస్‌లో ఆ సెలెక్షన్స్‌ను జెమినీ టీవీ నిర్వహించేది. దగ్గరే కనుక వెళ్లాం. అక్కడ నేను గిటార్‌ను ప్లే చేస్తూ పాడాలి. వాసు చిత్రంలో పాడనా... తియగా.. కమ్మని ఒక పాటా.. అనే పాట పాడాను. అంతా అయిన తర్వాత ఆడిటోరియంలో ఒకటే చప్పట్లు.. ఈలలు చాలా సంతోషమేసింది. అంతటితో నేను బాగా సంతృప్తి చెందాను.
సెలెక్టర్లు కూడా మీకు లెటర్ పంపుతామన్నారు. ఆ తృప్తి నీకు చాల్లే అనుకున్నారో ఏమో కానీ కొంత కాలం తర్వాత తెలిసింది. వాళ్లు నన్ను ఎంపిక చేయలేదని... గుండెలో ఏదో కాస్త బాధనిపించింది. కొంత కాలానికి తిరిగి కోలుకుని నా పనుల్లో నేను ఉండిపోయాను. ఆ తర్వాత రెండు సార్లు అలా అదే కార్యక్రమానికి వెళ్లాను గానీ ఎందుకనో మొదటి సారి చూపినంత శ్రద్ధను కనబరచలేకపోయాను. కారణం నిరుత్సాహమో.. లేక.. గురువుగారు లేకపోవడమో. ఏమో తెలియదు.
శ్యామ్ సార్ స్వతహాగా క్రిస్టియన్... పైగా చర్చి సెక్రెటరీగా ఉన్నారు. దాంతో ప్రతి సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో క్రిస్‌మస్‌కు శివ, నేను తప్పకుండా ఆయనకు అందుబాటులో ఉండేవాళ్లం. ఆయన కూడా సొంతంగా తయారు చేసుకున్న పాటలు.. రూపొందించిన మ్యూజిక్‌తో చర్చిలో పాటలు పాడేవాళ్లం.
ఆ ప్రవాహంలో నేను ఓ మూడు పాటలు రాశాను. ఆ పాటలు అందరి అభిమానాన్ని పొందాయి. ఇక చాలనుకున్నానో ఏమో తెలియదు గానీ.. నా కంటూ బాధ్యతలు... పనులు ఒత్తిడి.. వీటితో సమయం గడిచిపోయింది. ఇప్పుడు అసలు పూర్తిగా సంగీతం టచ్ పోయింది అని చెప్పలేను. ఓ సారి మళ్లీ తిరిగి ప్రారంభిస్తే... ఫ్లో వచ్చేస్తుంది. కానీ ఎంతో విలువైన... ఆనందమైన ఆ రోజులు తిరిగి వస్తాయా.. రావు.. అలాగే నాకు ఆనందాన్నిచ్చిన ఆ కాలం స్వల్పమే... కానీ అదే నాకు ఎన్నో మధురాభూతులను నిలిపింది.
నాకిప్పటికీ గుర్తు... నేను గిటార్‌ను ప్లే చేస్తూ పాడుతూ ఉంటే నా ఫ్రెండ్ అలాగే పడుకుని నిద్రపోయాడు. మా సార్ కూడా చాలా సార్లు తను పాడుతున్న పాటను కూడా నిలిపేసి నేను పాడుతున్న పాటను అదే పనిగా వినేవారు. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది.
అసలు నేను పాటను ప్రొఫెషనల్‌గా తీసుకోకపోవడానికి ఓ కారణముంది.. నా ఫ్రెండ్ శివ నాతో చాలా సార్లు ఇలా అన్నాడు. 'ఈ మ్యూజిక్ ఓ హాబీగా మాత్రమే తీసుకో... ప్రొఫెషనల్‌గా వద్దు. దానికోసం జీవితంలో చాలా వదులుకోవలసి ఉంటుంది. లేదా.. కోల్పోవలసి ఉంటుంది. సంగీతాన్ని జీవిత లక్ష్యంగా ఎంచుకున్న వారందరి జీవితాల్లో ఏదో ఒక త్యాగం... ఉంటుంది.
ప్రస్తుతం నువ్వు (నన్ను ఉద్దేశించి) ఉన్న పరిస్థితుల్లో నీకిది సరిపడదు. ముందు చక్కగా ఉద్యోగం చేసి కొంత కాలం స్థిరపడ్డ తర్వాత కావాలంటే ఇందులోను అడుగుపెట్టు' అని నన్ను నిరుత్సాహపరచకుండా అతను చెప్పిన ఆ మాటలు నాపై బాగా ప్రభావం చూపినట్లున్నాయి. అందుకే తు. చ తప్పకుండా పాటించా.
ఇక ఫైనల్‌గా నే చెప్పొచ్చేదేమిటంటే... మిత్రులారా... జీవితంలో ఏదో ఒక లక్ష్యం తప్పనిసరిగా ఉండాలి. కానీ ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి తగినన్ని ఆయుధాలను సిద్ధం చేసుకోవాలి. అందుకు మన దగ్గర ద్రవ్యం ఉండాలి. ఇంకా వివరంగా చెప్పాలంటే. 'మనీ మేక్స్ మెనీ థింగ్స్'. కానీ అదే జీవితం కాదనుకోండి.

లోడ్ అవుతోంది...
స్పందనలు