Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

సమస్యలకు తలవంచితే...



ఒక్కోసారి జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు.. పాఠాలు మనకు ఒక విధమైన కన్‌ఫ్యూజన్‌కు గురిచేస్తాయి. ఒకరి జీవితంలా మరొకరి జీవిత గమనం ఉండకపోవచ్చు గానీ... సమస్యల తాలూకు పోలికలు.. తద్వారా వచ్చేటటువంటి ఆలోచనల సమాహారం... ఒకరికొకరికి పోలికలు (చిన్న లేక పెద్ద కావచ్చు) దాదాపుగా దగ్గరగానే ఉంటాయనే చెప్పాలి.

కొందరికీ పెద్దయిన తర్వాత బాధ్యతల నిర్వహణలో వచ్చే సమస్యలు... ఇతరత్రా అంశాలు... మరి కొందరికి చిన్నతనంలోనే ఎదురవుతాయి. చిన్నతనంలో సమస్యలు ఎదురవ్వడం... పసిమనసులను.. మనుషులుగా ఎదగనిస్తాయో లేదో తెలియదు కాని.. తీవ్ర మనస్తాపానికి మాత్రం గురి చేస్తాయి.

ఇలాంటి వారు తాము తీసుకోదలచిన నిర్ణయాన్ని కూడా సరైన సమయానికి తీసుకోలేరు. అవతలివారిని నొప్పించకూడదు అన్నంత సున్నితంగా మారిపోతుండటం చూశాను. ఇలాంటి వారు శరీరానికి గాయమైనా భరిస్తారేమో గాని... మనసుకు తగిలితే మాత్రం అస్సలు భరించలేరు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... నేటి ఆధునిక కాలమంటూ ఎంతో మంది ఫాస్ట్ ఫాస్ట్ అంటూ వేగంగా వెళిపోతుంటారు. పూర్తి కమర్షియల్ మెంటాలిటీతో పయనిస్తుంటారు. అని ఇలా అనుకునే వారికి... ఇంత సున్నితమైన మనస్తత్వాలు ఉంటాయని చెప్పడానికే. ఇలాంటి మనస్తత్వం గలవారు అర్ధాంతరంగా నూరేళ్ల జీవితాన్ని ఇరవై ఏళ్లకే ముగిస్తుండటం ఇటీవల నేను తెలుసుకున్నాను.

ఓ సారి ఏం జరిగిందంటే.. నా ఫ్రెండ్ సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తాడు. వాడిని రిసీవ్ చేసుకోడానికి... అలాగే సెండాఫ్ ఇవ్వడానికి వాడొచ్చినప్పుడల్లా నేను క్రమం తప్పకుండా వెళతాను. అలాగే ఓ సారి తనకి ఎయిర్‌పోర్ట్‌లో సెండాఫ్ ఇచ్చేసి తిరిగి అందరం సుమోలో చేరుకున్నాం. ఆ రోజు ఎందుకనో ప్రతిసారీ డ్రైవర్ పక్కసీట్లో కూర్చునే నేను వెనుక బెడ్‌లా వేసి ఉన్న పరుపుపై ప్రశాంతంగ పవళించా.

కాసేపటికి నిద్ర వచ్చేసింది. సుమో నడుపుతున్న డ్రైవర్ కొంచెం నెమ్మదస్తుడిలాగే కనిపించినా కటువుగా అతని స్వరం ఉండటం గమనించి... ఇతను చాలా కఠినస్తుడే అనుకున్నాను. అయితే అతనికి అప్పటికి ఓ 25ఏళ్లు ఉంటాయి. సుమో బయలుదేరింది. హఠాత్తుగా... థన్‌మన్న శబ్దం వినపడింది. నా మెడ పట్టేసింది... చాలా గట్టిగా... . నా ఫ్రెండ్ వాళ్ల మరదలు చిన్నపాప గట్టిగా అరిచింది కూడా వినపడింది. ఏ జరిగిందని లేచి చూస్తే... ఇంకేముంది సుమో డ్రైవరు నేరుగా వెళ్లి పక్కన నిలబెట్టి ఉన్న ఓ వాహనాన్ని ఢీకొట్టాడు.

సుమో ముందు భాగం బాగా బలంగా తగలడంతో ఆయిల్ లీక్ అయ్యి... ముందున్న వాహనంలో ఇరుక్కుపోయింది. దీంతో నా ఫ్రెండ్ వాళ్ల నాన్న తిట్లపురాణం ఎత్తుకున్నాడు. ఏంబాబో డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైనా నిద్రపోతారా... నాకు ఇరవై ఐదేళ్ల సర్వీసు నేను ఏ రోజు ఈ విధంగా చేయలేదంటున్నాడు.

డ్రైవరుకేమో ఏం చేయాలో పాలు పోలేదు. మరి నా పరిస్థితి ఇక చెప్పనవసరం లేదు. ఓ వైపు పట్టుకుపోయిన మెడ మరోవైపు ఒత్తిడి. ఇంతలో నా ఫ్రెండ్ వాళ్లమ్మ అంటోంది. చెన్నైలోనే ఈ పిల్లోడు వేరే లారీకి గుద్దేయాల్సింది రమేషా... నేను బాబొ అని అరిసే సరికి ఆ పిల్లోడు తప్పించేశాడు. అని అంటోంది. ఇంతలో ఉన్నట్లుండి డ్రైవరు మాయమయిపోయాడు.

ఇక చూస్కోండి... అక్కడ చీకటి పైగా అడవి... ఆ వాహనంలో డీజిల్ అయిపోవడం వల్ల సైడ్‌గా నిలబెట్టి ఉంచారట. ఆ వాహనాన్ని సుమో వెళ్లి ఢీ కొంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే... మా సుమో డ్రైవరు ఎందుకైనా మంచిదని ముందుగానే 30కి.మీల వేగంలో మాత్రమే సుమోను నడిపాడు కాబట్టి మేము... ఢీకొన్న వాహనం బాగుంది. లేకుంటే... అందరం ఈ పాటికి బహుశా వద్దులే... మళ్లీ అపశకునం అంటారు.

సరే మరి డ్రైవరు కనపడలేదు కదా... ఇక నేను నా ఫ్రెండ్ వాళ్ల నాన్నను పిలిచి 'అంకుల్.. ఇద్దరం కలిసి ఢీ కొన్న వాహనాలను వేరు చేద్దాం అన్నాను. దాంతో ఆయన (నా ఫ్రెండ్ నాన్న) రాదు రమేషా.. అది ఢీకొన్న దెబ్బకు ఇంజిన్ ఆయిల్ కింద కారిపోతున్నట్లుంది అన్నాడు. అయినా ఫర్వాలేదు ప్రయత్నిద్దాం అన్నా. దాంతో సరే నాయనా కానీ అన్నాడు. ఆయనో పక్క నేను ఓ పక్క. తలో చెయ్యి వేశాం.

సుమో ముందుకు వచ్చి వెనక్కి నెట్టాం. కానీ ఆ క్షణంలో అక్కడ నాకు చాలా భయం వేసింది. నేనున్న పక్క ఎవరూ లేదు. మేము ఢీ కొన్న వాహనంలో ఓ శవం... శవంపై తెల్లటి గుడ్డ కనపడింది. అదీ సినిమాల్లో భయంకరంగా చూపిస్తారు.. ఆ రేంజ్‌లో కనపడే సరికి బిత్తరపోయాను. ఒళ్లంతా చెమటలు. అప్పుడర్థమైంది అది మార్చురీ వ్యాన్ అని. అతనెవరో చెన్నై ఆసుపత్రిలో మరణిస్తే.. శవాన్ని స్వస్థలానికి తీసుకెళుతున్నారు.

సరే... కాస్త తేరుకుని సుమోను వెనక్కి నెట్టాం. నో ఛాన్స్ అది కుదరలేదు. అందరం మళ్లీ ఎందుకైనా మంచిదనుకుని సుమోలో ఎక్కి ప్రశాంతంగా కూర్చునేశాం. ఇంతలో అదృశ్యమైన డ్రైవరు ఓ జీపును తీసుకుని మమ్మల్ని దాంట్లో ఎక్కించాడు. అలాగే మార్చురీ వ్యాన్‌ను ఢీ కొన్నప్పుడు దాని కింద డ్రైవరు పడుకుని ఉన్నాడు. ప్రమాదంలో అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి.

అతన్ని కూడా తీసుకుని మా ఊరు చేరుకున్నాం. నా ఫ్రెండ్ వాళ్లమ్మ నాన్నకు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు. వాళ్ల నాన్నకు మాత్రం కాళ్లు ఏదో కొంచెం బెణికితే... నేను నాకు తెలిసిన పంథాలో చిన్నపాటి సేవ చేసి మా ఇంటికి వెళ్లిపోయాను. ఇది గడిచి ఇప్పటికి రెండేళ్లయ్యింది.

అంతా సద్దుమణిగింది.. అయితే నాలుగు నెలల క్రితం ఓ పిడుగులాంటి వార్తను నా చెవిన పడింది. లేదు లేదు బహుశా ఆ వార్తను వెతుక్కుంటూ నేనే వెళ్లానేమోగాని.. ఆర్కె ఫోటో కలర్ ల్యాబ్‌లో పనిచేసే రాజేష్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. వాడిని కలవడానికి ల్యాబ్‌కు వెళ్లాను. అక్కడ వెళ్లేసరికి ఓ ఫోటోకు సంబంధించి మెరుగులు దిద్దుతున్నాడు రాజేష్.

ఆతన్ని తెలిసిన వాడిగా గుర్తించి... ఏంట్రా ఇతని పెళ్లా అని అడిగాను ఆసక్తిగా.. లేదు.. చచ్చిపోయాడంట. ఆ... ఎప్పుడు రా... జస్ట్ ఇప్పుడేరా.. వాళ్లొచ్చి ఫోటో ఇచ్చి వెళుతున్నారు.. నువ్వొస్తున్నావు అన్నాడు. అతనెవరో కాదు. ఆ రోజు మా సుమో తాలూకు డ్రైవరు. కాస్త మనసు గిల్లినట్లయింది.

ఇంతలో ఆ ఫోటోకు సంబంధించిన వాళ్లు వచ్చారు. మనసాగక వాళ్లనడిగాను. ఏంటండి ఏమయింది అసలు. ఎందుకు చనిపోయాడు. ఏదైనా జబ్బా అని అడిగాను. దానికతను 'లేదు. ఏం చెప్పమంటారండీ. ఉరేసుకుని చచ్చిపోయాడు. వెధవనాయాలు అన్నాడు'. నేను వెంటనే అందుకుని ఎందుకు వెధవా అంటున్నారు. ఏదైనా తప్పు చేశాడా..

లేదండీ.. ఏ తప్పు చేయలేదు. అతనో అమాయకుడు. ఎవరికీ ఏ అన్యామమూ చేయలేదు. పైగా మూడు నెలల క్రితమే పెళ్లయింది. కానీ.. మ్... కానీ.. చెప్పండి. అప్పులు.. దానికి తోడు.. గతంలో ఓ యాక్సిడెంట్ చేశాడు. అది మార్చురీ వ్యాన్ కావడంతో ఆసుపత్రి వాళ్లు కేస్ పెట్టారు. దాన్ని లాక్కోలేక పీక్కోలేక.. మరోవైపు ఇంట్లో సమస్యల సుడిగుండం విపరీతమైన ఒత్తిడిని తట్టుకోలేక ఉదయాన్నే నిద్రపోతానని చెప్పి... ప్రస్తుతం శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు'. అని చెప్పాడు.

ఎంత దారుణం. సమస్యలను ఎదుర్కోలేక చనిపోయాడా అని వెంటనే మనకు అనిపించినా.. ఆ సమస్యలను ఎదుర్కొనే వారికే తెలుస్తుంది. దాని తాలుకు తలనొప్పి ఏమిటో. అలాగని అతని ఆత్మహత్యకు మద్దతునివ్వడం లేదు. ఎవరూ ఆదుకోక... తన గోడు విన్నవించుకుందామన్నా.. వినే వారు లేకపోతే.. ఏ మనిషికైనా తొలుత పిచ్చిపడుతుంది. అదీ అమ్మనాన్న కూడా దగ్గర లేకపోతే.. అర్థం చేసుకోలేని సహచరి ఉన్నా లేనట్లే. అటువంటి బలహీన క్షణాలు ఆత్మహత్య వైపు దారి చూపిస్తాయి.

అన్నట్లు చెప్పడం మరిచా అతను చనిపోయే ముందు ఓ లేఖను రాశాడట. 'అంతుబట్టని సమస్యలు... అలుపెరుగని పరుగులు ఈ ప్రపంచంలో ఇక నా వల్ల కాదు. వాటిని ఎదుర్కొనే ధైర్యం ఇక నాకు లేదు. నేను పిరికివాడిగా వెళ్లిపోవడం లేదు. నా వాళ్లు.. నన్ను నమ్ముకున్న సహచరి అన్యాయం కాకూడదనే నే వెళ్లిపోతున్నా.

ఎందుకంటే.. నేను బ్రతికుండి నా సహచరిని సుఖపెట్టలేను. నే పోతే.. ఎవరూ ఏడవకండి. అది నా ఆత్మకు శాంతి చేకూర్చదు. నా కావలసిందల్లా.. నే పోతే కనీసం నా భార్య మరో యువకుడిని.. కాస్తో... కూస్తో డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుని సుఖపడగలదు. అప్పుడే నా ఆత్మతృప్తి. నా వల్ల ఎవరూ బాధపడటం నేను చూడలేను. వినలేను కూడా.

కనుక మీరందరూ సంతోషంగా ఉంటూ.. భగవంతుడైన ఆ అల్లా దగ్గరికి చేరుకొబోతున్న నాకు ఆత్మతృప్తినివ్వండి. నిజానికి ఇది క్షమార్హం కాని పనే కావచ్చు. కానీ అన్నీ తెలిసిన అల్లా నాపై దయచూపిస్తాడని... నాకు.. నాకు సంబంధించిన మీకు ఎలాంటి అన్యాయం జరుగదని ఆశిస్తూ.. శెలవు తీసుకుంటున్నాను.

మరు జన్మ ఉందో లేదో.. మళ్లీ కలుస్తామో లేదో.. ఇప్పటికి.. ఈ జీవితానికి ఇంతే మరి వెళ్లిపోతున్నా..' ఇది ఆ లేఖలోని సారాంశం. నాకు తెలియకుండా కళ్లవెమ్మట నీళ్లొచ్చాయి. ఎంత నిస్వార్థంగా ఆలోచిస్తున్నాడితడు. సమాజం గురించి నాకు తెలియదు గానీ. సమాజంలో ఉన్న కొంత మంది నిర్భాగ్యులు ఇలా అర్థాంతరంగా అంతమైపోతుండటం దురదృష్టకరం. పెళ్లై మూడు నెలల కూడా నిండని ముక్కుపచ్చలారని జీవితపు మొక్క... తుఫానులాంటి సమస్యలు ఆరంభంలోనే తుంచివేశాయి.




స్పందనలు

Re: సమస్యలకు తలవంచితే...
మామా... చదువుతుంటే నాకు తెలియకుండానే నా కళ్లవెమ్మట నీళ్లు వచ్చాయి.... బావుంది సమస్య గురించి రాసి, సమస్యను ఎలా ఎదుర్కొవాలో మంచి సలహా ఇచ్చాడు కదా ఆ డ్రైవర్...!!!!!!
Re: సమస్యలకు తలవంచితే...
అది అతను ఇచ్చే పరిష్కారం కాదు. ఇక్కడ పరిష్కారం... జటిల సమస్యలు తదితరమైన వాటి గురించి నేను రాయలేదు. మనసు ఎంత సున్నితంగా ఉంటుందో జస్ట్ ఒక ఉదాహరణగా మాత్రమే ముందుకు తెచ్చా. అతని పరిష్కరించారు అన్నారు. అది పరిష్కారం పరికితనం. ఇంకో వైపు చెప్పలంటే... ఒత్తిడిని తట్టుకోలేని ఇతరులకు చెప్పుకోలేని మానసిక ఒంటరి వెలుగు కోసం తపన పడి.. నిరాశ, నిస్పృహలతో చీకటిలోనే నలిగిపోయిన ఓ నిర్భాగ్యతనం. నేను ప్రస్తావించిన ఈ ఆర్టికల్‌లో కేవలం మనస్తత్వం గురించి మాత్రమే ఆవిష్కరించా. అంతేకానీ. అతని సమస్యలను ప్రస్తుతించలేదు. పైగా తన లేఖలో 'ఇలా ఎవరికీ జరుగకూడదు. అలాగే ఇలా ఎవరూ చేసుకోవద్దు' అని తెలిపాడుట.
Re: సమస్యలకు తలవంచితే...
జీవితాంతం తోడుంటానని అల్లా సాక్షిగా ప్రమాణం చేసి, నిఖ్ఖా చేసుకుని - పెళ్లయిన 3 నెలలకే సహచరిని సమస్యల సుడిగుండంలో వదిలేసి ఉరి వేసుకున్న సంఘటనను తమరిని కదిలించి... "అతను ఎంత నిస్వార్థంగా ఆలోచించాడు" అనేంతలా ప్రస్తుతించారంటే మీదెంత గొప్ప మనసు. సమస్యలున్న ప్రతివాడూ ఆత్మహత్య చేసేసుకుంటూ, పెళ్లాన్ని మరో పెళ్లి చేసుకోమని లేఖ రాసిపెట్టేస్తే సరిపోతుందన్నమాట.~~ ~~~~ అదిరిందయ్యా రమేష్..
నిరాకరణ