Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

ప్రేమతో సహవాసం....



ఎంతో మంది ప్రేమికులు మనసులో పాడుకునే పాటలోను.. అలాగే మనసులో మననం చేసుకునే మాటలోను అనుకుంటుంటారు. నాలో నేను లేనే లేను.. ఎప్పుడో నేను నువ్వయ్యాను...అడగక ముందే.. అందిన వరమా.. అలజడి పెంచే తొలి కలవరమా.. ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా... కొన్ని సార్లు ఈ మాటలు/పాటలోని సాహిత్యం సాధారణ పదచిత్రణే అయినా గుండెలో మాత్రం సవ్వడిని, మరొకరితో పెనవేసుకున్న బంధం తాలూకు ముఖచిత్రాన్ని జ్ఞప్తి చేసుకునేంత అనుభూతిని కలిగిస్తాయి.

ఈ రోజుల్లో దాదాపుగా చాలా చోట్లనే కాకుండా.. ప్రపంచంలో ఏ మూలనైనా నిత్యం యువత.. ప్రేమ నామస్మరణ చేస్తోంది. తమ జీవితం చక్కటి ఓ ప్రేమబంధం కావాలని కలలు కంటూ.. ఊహాలోకాల్లో విహరిస్తూ తమని తాము మరిచిపోతూ అలా అలా స్వాప్నిక జీవితంలో అడుగులేస్తున్నారు. అలా అడుగులేస్తూ తుళ్లిపడ్డవారు.. కొందరు దేవదాసులైతే.. మరికొంత మంది ప్రేమోన్మాదులుగా మారి ప్రేమ పట్ల వ్యతిరేకత తెలియపరుస్తున్నారు.

అయితే కొందరు మాత్రం ప్రేమను (వ్యక్తిని కాదు) మరింతగా ఇష్టపడుతున్నారు. అవతలి వారు ఇష్టపడకపోయినా... తాము పూర్తిగా ప్రేమించి విజయం సాధించామనుకుంటూ... ప్రేమనేది శాపం కాదు.. అది చిగురాశల జీవితానికి ఓ శక్తి అంటూ ఉన్నతస్థాయి దిశగా అడుగులేస్తున్నారు. భాష ఏదైనా, వ్యక్తపరిచే రీతిలో మార్పులుండవచ్చేమోగాని మనసులోని భావాలు మాత్రం ఇంచుమించు తారతమ్యాలు లేని ఒకేరకమైన నిగుఢార్ధాన్ని ప్రస్ఫుటిస్తాయి.




ఓసారి మనసు తలపుల్లోకి...

స్నేహం జీవితంలో ఎదగడానికి కావలసిన స్ఫూర్తినిస్తే..
ప్రేమ స్ఫూర్తివంతమైన జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించే శక్తినిస్తుంది..
స్నేహం ధైర్యాన్నిస్తే.. ఆ ధైర్యానికి కావలసినంత ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది ప్రేమ..

అభూతకల్పన కాదీ ప్రేమ..
కాదన్న వారి చేతనే ప్రేమ నామస్మరణ చేయిస్తుందీ ప్రేమ..

తల్లి చల్లని దీవెన పేరు ప్రేమ అయితే..
జీవితంపట్ల మన బాధ్యతను తెలిపేదీ ప్రేమే..
విడగొట్టడం, విడిపోవడం.. కలిసి ఉండటం.. కలవాలనుకుంటుండటం..
కోరుకోవడం..కోరుకుంటుండటం ఇవన్నీ ప్రేమలోని ఘట్టాలు మాత్రమే..

ఇవన్నీ దాటుకుంటూ వచ్చి...
మనసారా ప్రేమించిన వారి పట్ల ద్వేషాన్ని చూపే పేరు కూడా ప్రేమే..

ఆ ద్వేషభావం ప్రేమకు తార్కాణం..
ఎక్కడ తనకు దక్కకుండా పోతారోనన్న కోపంతో కూడిన ఆరాటం..
ఆరాటంలోని ఆరాధనతో కూడిన ఓ అద్భుత ప్రణయం..

మరువక, మరిచిపోలేక, మరపురాక మనసు నిలువనీక వద్దంటూనే...
ప్రతిజన్మకు కావాలని కోరుకునే ఓ సుందర ఘట్టం..

స్నేహం, ప్రేమ రెండూ తల్లి, బిడ్డలాంటివి..
ఎవరు ఎవరికి లేకపోయినా రెండు కళ్లలో ఒకటి లేనట్లే...


(అంతం కాదిది ఆరంభం...)

స్పందనలు

Re: ప్రేమతో సహవాసం....
జీవితమే ప్రేమ అనే దగ్గర నుంచి జీవితంగా ఓ భాగం మాత్రమే ప్రేమ అనే స్థాయిలో ఉంది నేటి ట్రెండ్. అయినా.. మీ ' ప్రేమతో సహవాసం..' బాగుంది విశ్లేషణాత్మకంగా కాకపోయినా.. అర్థవంతంగా చదివించేలా ఉంది.
నిరాకరణ