Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

స్నేహం అంటే అంతేనా.. అంతానా...

స్నేహిద్దాం...


చాలా కాలం నుంచి ఈ ఆర్టికల్ రాయాలనుకని ఎలా రాయాలో (అంటే ఎవరి మనసు నొప్పించకుండా) తెలియక.. అవగాహన ఉన్నా రాసినా సరైన దృక్పథం రాక.. సతమతమవుతూ.. సరే ఏదైతే అదైంది నేను చెప్పాలనుకున్న దాన్ని చెప్పాలనే నిశ్చయానికి వచ్చాను. అందుకే ఇలా ముందుగా పరిచయ వ్యాఖ్యగా రాస్తున్నాను.

విషయంలోకి వస్తే.. ఓ మిత్రుణ్ణి స్నేహం అంటే నీ అభిప్రాయం ఏంటని అడిగితే.. అవేమన్నా కడుపు నింపుతాయా పాడా.. ఎందుకు అవంతా వేస్ట్ అన్నాడు. మంచి సమాధానం అనుకుని వెంటనే మరో మిత్రునికి మొబైల్ ద్వారా స్నేహంపై నీ అభిప్రాయం ఏంటంటూ ఎస్ఎంఎస్ చేశా. అతను పూర్తి భిన్నంగా .. స్నేహం దేవుని వరంగా అభివర్ణిస్తూ రిప్లై చేశాడు.

ఇలా చాలామందిని అడిగా. ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకుంటూ పోయారు. కాని ఇక్కడ ఓ విషయం గమనించాల్సి ఉంది. స్నేహం గొప్పది అని చెప్పుకునే చాలా మంది వాళ్లు చేస్తున్న స్నేహం ఏపాటిదో వివరిస్తారు.. కానీ భరోసా మాత్రం ఇవ్వలేరు.. ఏమంటే దానికో లాజిక్కు చెబుతారండోయ్.

మనిషే శాశ్వతం కాదు.. ఇక స్నేహమేంటిరా నాయనా అని.. బాగానే ఉంది లాజిక్కు. అంత నమ్మకం లేనప్పుడు స్నేహం చేయడం దేనికి. పుట్టినప్పటి నుంచి మనకు ఎంతో మంది తారసపడినా ఏ ఒక్కరో, ఇద్దరితోనో ఎక్కువ సన్నిహితంగా మెలుగుతాం. మన బాధల్ని పంచుకుంటాం.

కుటుంబ సభ్యులతో చర్చించలేనివి.. చెప్పకూడనివి ఎన్నో స్నేహానికి వివరించి మన గుండెలోని బరువును దించుకుంటాం. ఇక్కడ మనకు తెలియాల్సింది.. అవతలి వారు మనకు అర్థమయ్యారా లేదా.. అన్నది ప్రశ్న. బాగా సన్నిహితంగా ఉండే ప్రతిఒక్కరూ చెబుతారు. ఒకరికొకరు బాగా అర్ధం చేసుకున్నామని.

కానీ ఇటీవలి సర్వేలో తేలిందేమిటంటే.. ఒకరికొకరు అర్థం చేసుకున్నామనుకున్న మీమాంసలో పడి.. అలాగే కంటిన్యూ చేసేస్తున్నారు. ఒకానొక సమయంలో అర్థం చేసుకున్నామనుకుంటున్న వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడి ఇద్దరినీ విడదీస్తుంది. అదేమంటే.. వాడు ఈ మధ్యలో మారిపోయాడు అన్న ధోరణి వచ్చేస్తుంది. లేదా ఇంకేదో మరి సన్నివేశానికి తగ్గట్టుగా వచ్చే ఆరోపణలుంటాయి.

ఇద్దరి మధ్య ఏర్పడిన మానసిక అగాధం ఒకానొక సమయంలో అగ్నిజ్వాలగా ప్రజ్వరిల్లి స్నేహమనే పూలతోటను నిప్పుల కణికగా.. మార్చి వేస్తుంది. బ్రతకడానికి రోటీ, కపడా ఔర్ మకన్ అయితే చాలు.. కానీ.. జీవించడానికి మాత్రం చాలా కావాలని పెద్దలన్నారు. డబ్బు, హోదాల కంటే అన్యోన్యత కలిగిన ఆరోగ్యంగా, అజరామరంగా సాగే సంబంధాలను కలిగి ఉండాలి.

ఓ స్నేహితుడు ఇలా అంటున్నాడు.. నేను చాలా ప్రాక్టికల్... వాడు (తన స్నేహితుడిని) స్నేహితుడే కావచ్చు.. కాని వాడికంటే నా సమస్యలు బొచ్చెడన్ని ఉన్నాయి... పోరా బాబు. నేను కష్టపడేప్పుడు నన్ను ఎవరూ ఆదుకోలేదు. కాని అవతలి వ్యక్తి ఆదుకునే పరిస్థితిలో ఉన్నాడో, లేదో ఇతనికి తెలీదు. మరొక విషయం ఏంటంటే.. ఒకరకంగా అవతలి స్నేహితుని సాయం ఏదో రూపంలో అందే ఉంటుంది. కాని ఇతను దాన్ని గుర్తించడు.. గుర్తించలేడు. అయినా ఫలితం ఆశించా మనం స్నేహం చేస్తాం...?

ఫలితం ఆశించేట్లయితే దానిపేరు స్నేహం ఎలా అవుతుంది...? అని ఇలాంటి వారిని అడిగితే మాత్రం సమాధానం ఉండదు. కేవలం ఎంటర్‌‌టైన్‌మెంట్స్, సరదాలకు.. లేదు ఇంకొంచెం ముందుకెళితే మందుకొట్టడం... అంతకంటే ఇంకేదీ లేదా ఈ స్నేహంలో. స్నేహమంటే అంతేనా..

మీకు తెలిసిన విషయాలు
స్నేహమంటే లాభనష్టాలు, శుభాశుభాలను బేరీజు చేసే మ్యాథమాటికల్ సొల్యూషన్ కాదు. మనలో ధైర్యాన్ని, స్ఫూర్తిని.. అడుగడుగునా ప్రోత్సాహాన్నందించే అమృతం లాంటి స్వచ్ఛమైన తియ్యటి అనుబంధం. మన పురాణాల్లోని గాధల్లో
దానికున్న విలువ ఏపాటిదో.. విశిష్టతలేమిటో తెలియజేయడం విశేషం.

ఒక్కసారి రియలైజ్ అవుదాం..
ఇంతకీ ఇన్ని విషయాలను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే... స్నేహంతో స్నేహిస్తున్నామనుకుని.. స్నేహబంధాన్ని సంకటంలో పడవేయవద్దని చెప్పటమే. స్నేహితులారా..! ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా... మనలో ప్రాక్టికల్ మైండ్ ఉన్నా, లేకున్నా మన తోటి స్నేహానికి విలువ ఇద్దాం. అలాగని చులకన చేశారని, చేస్తున్నారని కాదు.

కొంత మందికి ఎంతో మంది స్నేహితులున్నా... ఎవరూ లేనట్లే ఉంటారు. అలాంటి వారి గురించి వాళ్ల స్నేహితులకు కూడా వివరాలు తెలీవు. అదేమంటే వ్యక్తిగతం అంటారు. వ్యక్తి తన గతాన్ని తవ్వుకుంటూ కూర్చోవడం వల్లే సమస్యలొస్తాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే దానికి స్నేహమే పరిష్కారం చూపించగలదని నా నమ్మకం. దేవుడు మనకు కల్పించిన.. లేదా ఇచ్చిన కొన్ని అద్భుతాల్లో అత్యంత విలువైన వాటిల్లో స్నేహం కూడా ఒకటి కదా.

ఇక ఆఖరుగా ఓ చిన్న మాట..

నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను అని చెప్పేవాళ్ళకంటే.. నీలాగే నేను ఫీలవుతున్నాను రా.. అని చెప్పేవాళ్లే నిజమైన స్నేహితులని ఓ మహానుభావుడు శెలవిచ్చారు. ఇది నగ్న సత్యంగా నేను నమ్ముతాను. సో.. మనతో స్నేహాన్ని ఇష్టపడేవారిని ఎంత దూరంలో ఉన్నా... వాళ్లు మనకు సాయం చేసినా, చేయకపోయినా ఏదో ఒక రూపంలో పలుకరించి మాట సాయంగా మనవైపు నుంచి ఆత్మీయతను అందిద్దాం. వారిపట్ల మనకున్న ఆప్యాయతను తెలియజేద్దాం. తద్వారా మనలోను.. అవతలి వారిలోను ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్ని... కొండంత ధైర్యాన్ని కల్పిద్దాం. స్నేహమాధుర్యాన్ని రుచి చూపించి...


నిరాకరణ