![]()
ఓ రోజు సొంత పని మీద కడపకు బయలుదేరాను. తిరుపతి బస్టాండులో కడపవైపు వెళ్లే జమ్మలమడుగు బస్సు ఎక్కి కూర్చున్నా. బస్సు బయలుదేరిన కాసేపటికి నాకు బాగా నిద్రపట్టేసింది. రాజంపేట వచ్చిన తర్వాత మెలకువ వచ్చింది. అక్కడ బస్టాండులో బస్సు ఆగివుంది.
సరే... బస్సు దిగి కాస్త మొహం కడుక్కుని.. ఓ కూల్‌డ్రింక్ తాగి మళ్లీ బస్సెక్కా.. కాసేపటికి మళ్లీ బస్సు బయలుదేరుతున్నంతలో ఓ యువతి బస్సెక్కింది. వెనకాలే మరొకతనూ ఎక్కాడు. అతను నా పక్కన కూర్చున్నాడు. ఆయువతి లేడీస్ సీట్లలో కూర్చుంది. బస్సు బయలుదేరిన కాసేపటికి ఇందాక రాజంపేటలో బస్సు ఎక్కిన యువతి లేచి.. తన చేతిలోని ముద్రించి ఉన్న కాగితాలను అందరికీ ఇస్తోంది.
అలా నాకూ ఒక కాగితాన్ని ఇచ్చింది. సరే తీసుకుని చదివా.. సగం చదవగానే విషయం అర్థమై.. ఆమెను తిడదామని గొంతు వరకు వచ్చిన మాటలు.. అంతరాత్మ చెప్పిన సమాధానంతో మాటలు గొంతులోనే ఆగిపోయాయి. దీంతో అలాగే మిన్నకుండి పోయాను. ఇంతలో నాముందు సీట్లో కూర్చున్నావిడకు ఓ 35 ఏళ్ల వయసు ఉండవచ్చు.
ఆవిడ.. ఈ యువతిని పిలిచి ఏమిటిది.. గుజరాత్‌లో భూకంపం వచ్చి ఎంత కాలమైంది..? అడుక్కోవడానికి సిగ్గులేదు..? జనాలను ఎందుకు మోసం చేస్తారు....? బుద్ధి లేకపోతే సరి..? అంటూ నాలుగు చీవాట్లు తగిలించింది. ఆ యువతి అవేమీ పట్టించుకోకుండా.. తను ఇచ్చిన కాగితాన్ని సావధానంగానే తీసుకుంది.
ఆ తర్వాత అందరికీ కనపడే విధంగా చేతులెత్తి నమస్కరించి.. తన, తనవారి కడుపు నింపుకోవడం కోసం అంటూ దీనంగా మూగభాషలో వ్యక్తం చేసింది. బహుశా మూగది కూడా అనుకుంటా. దీంతో బస్సులో ఉన్నవారిలో కొంత మంది వాళ్లకు తోచినంత ఇచ్చారు. అలాగే నేనూను.. ఇలాంటి విషయాలు ఈరోజుల్లో చాలా సర్వసాధారణమే. కానీ ఫ్రెండ్స్..
నా ముందు సీట్లో కూర్చున్నావిడ ఆ యువతిని చీవాట్లు పెడుతున్నపుడు నా మనసు చలించింది. అందుకే ఈ విషయాన్ని మీతోటి పంచుకోవాలనుకున్నాను. అందుకే నాకు తెలిసిన దానిని అక్షరబద్దం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. ఎవరి సమస్యల్లో వారు కూరుకుపోయి ఉన్నప్పుడు ఈ సమస్య పట్టించుకోవడం అవసరమా అంటే.. అందరూ ఇలా అనుకుంటూ పోతే.. ఈ విషయాన్ని గురించి పట్టించుకునేదెవరు. అలాగని ఏదో ఉద్ధరించేయాలని కాదు.
నిజానికి అడుక్కుతిని బ్రతకాలని ఎవ్వరికీ అనిపించదు. అందులోను యువతులకు అలాంటి భావన వచ్చిందంటే.. తను ఎంత విధిలేని పరిస్థితుల్లో ఉంటే.. ఈ విధంగా బస్సుల్లో ఎక్కి మరీ అడుక్కుంటుంది. ఎప్పుడో గుజరాత్‌లో భూకంపం వచ్చి అక్కడి పరిస్థితులు తలక్రిందులై అక్కడి వారు వివిధ ప్రాంతాలకు వలస వచ్చారు.
అలాగే మన రాష్ట్రానికి కొన్ని వేలమంది తరలి వచ్చారు. కడుపు చేత పట్టుకుని ఇక్కడికి చేరి.. వారికి తోచిన పనులు చేసి కడుపు నింపుకున్న వారు కొందరైతే, ఇంటి పెద్ద భూకంపంలో మృతి చెందడం వల్ల ఆధారం కోల్పోయిన మహిళలు.. ఏ పనులు చేయాలో తెలీక.. ఎంత నరకయాతన అనుభవించి ఉంటారో.. పట్టెడన్నం కోసం ఎన్ని రోజులు అలమటించి ఉంటారో.
చివరికి ఇక గత్యంతరం లేక భిక్షాటనే శరణ్యంగా.. భిక్షాటనే తమ వృత్తిగా మలుచుకుని ఎంత మంది జీవనం వెలిబుచ్చుతున్నారో చెప్పడం కాస్త కష్టమే. నిజానికి భూకంప బాధితుల కోసం గుజరాత్ ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల నిధులు విరాళాలుగా ఇవ్వడం జరిగింది. అయితే అవినీతి విలయతాండవం చేస్తున్న ఈరోజుల్లో వారికి ఈ సాయం అందివుంటుందా అంటే అది అనుమానమే.
ఇలా అందాల్సిన సాయం కూడా చేరనప్పుడు ఇంకెవరు ఆదుకుంటారు. అందుకే ఏ దారి లేని వాడికి గోదారే రహదారి అన్నట్లు భిక్షాందేహీ అంటూ భిక్షువులుగా మారి సాయం చేయమని చేతులు జోడించి వేడుకుంటున్నారు వారు. అంతేకాని.. దోపిడీలు చేయట్లేదు.. దగాకోరు చేయడం లేదు. అలాగని అందరూ అంటున్నారని కాదు. అలా అంటున్నవారిలో కాస్తోకూస్తో మార్పును నేను ఆశిస్తున్నా.
కడుపునిండిన వారు అనేక మంది అవినీతి పరులుగా మారి ఇతరుల కడుపు కొడుతున్నారు. మరి అలాంటప్పుడు తమ, తమ వారి కడుపు నింపుకోవడం కోసం చాయిచాచి అడుక్కుంటే తప్పేంటి.
మీకు తెలిసిందే.. బలిచక్రవర్తి కథ తెలిసిందే. సాక్షాత్తు శ్రీమహావిష్ణు రూపుడైన ఆ వైకుంఠవాసుడే వామనరూపుడై.. బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి భిక్షం అడిగినాడు. లోకకళ్యాణం కోసం ఆ పరమాత్మయే భిక్షమెత్తినప్పుడు.. సాధారణ మానవమాత్రులం మనమెంత...!
కాబట్టి డియర్ ఫ్రెండ్స్...!
మనకు వీలైతే మన దగ్గర ఉన్నంతలో సాయం చేద్దాం ఇలాంటి వారికి. అలా లేని పక్షంలో కనీసం సాయం చేస్తున్నవారితో చేయి కలిపి ప్రోత్సహిద్దాం. అలాగని భిక్షువులను ఊరికే వదిలివేద్దామని కాదు. మార్పు అనేది సహజం. ప్రతి విషయంలోను.. ప్రతి అంశంలోను తప్పనిసరిగా మార్పు ఉంటుందని నా నమ్మకం... కాదంటారా. మిత్రులారా..!
అలాంటి మార్పు వారిలో వస్తుందని.. రావాలని. ఆశిద్దాం. లేదా మనమందరం కలిసి ఒక మంచి ఆలోచనకు శ్రీకారం చుడదాం. బిక్షగాళ్లు లేకుండా చేయడం సాధ్యం కాకపోవచ్చుకాని కొంత మందినైనా మనకు చేతనైనంతవరకు మార్చగలిగితే అంతకన్నా
ఏముంది మన ఈ జీవితానికి సార్థకత. ![]()
లోడ్ అవుతోంది...
స్పందనలు